: మరణ ధ్రువీకరణకు ఆధార్ తప్పనిసరి కాదు... స్పష్టతనిచ్చిన ప్రభుత్వం
చనిపోయిన వారి గుర్తింపు కోసం అక్టోబర్ 1 నుంచి మరణ ధ్రువీకరణ సమయంలో ఆధార్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ఆ ఉత్తర్వులపై పూర్తి స్పష్టతనిచ్చింది. మరణ నమోదు సమయంలో ఆధార్ ఉంటే మిగతా పత్రాలు అవసరం లేదు, ఒకవేళ మరణించిన వ్యక్తికి ఆధార్ లేకపోతే కుటుంబ సభ్యులు గానీ, బంధువులు గానీ అందుకు సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. వ్యక్తి మరణ నమోదుకు ఆధార్ అనుసంధానం చేయడం వల్ల మోసాలను నిరోధించే అవకాశం కలుగుతుందని ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
అలాగే మరణ ధ్రువీకరణ సమయంలో తప్పుడు వివరాలు సమర్పిస్తే ఆధార్ చట్టం 2016, జనన మరణ నమోదు చట్టం 1969 ప్రకారం వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉందని పేర్కొంది. ఇప్పటివరకు మరణ ధ్రువీకరణను స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా, శ్మశానంలో సర్టిఫికెట్ చూపించడం ద్వారా చేసేవారు. ఇక నుంచి ఆధార్ అనుసంధానం వల్ల మరణించిన వ్యక్తి గుర్తించి కచ్చితమైన వివరాలు తెలుసుకునే అవకాశం కలగనుంది.