: పాకిస్థాన్ ప్రభుత్వంలో హిందువు.. రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి!
పాకిస్థాన్ ప్రభుత్వంలో ఓ హిందువుకి చోటు దక్కింది. అవినీతి ఆరోపణలతో నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయిన తర్వాత షాహిద్ ఖాకన్ అబ్బాసీ ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. శుక్రవారం ఆయన తన కేబినెట్‌ను విస్తరించారు. నవాజ్ షరీఫ్ సన్నిహితులు, మద్దతుదారులతో కేబినెట్‌ను నింపేసిన అబ్బాసీ, అందులో ఓ హిందువైన దర్శన్‌లాల్(65)కు చోటు ఇచ్చారు. పాక్ కేబినెట్లో ఓ హిందూ మతస్తుడికి చోటు దక్కడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. వచ్చే ఏడాది మధ్యలో జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అబ్బాసీ కేబినెట్‌ను విస్తరించారు. మొత్తం 47 మందిని మంత్రులుగా నియమించారు. అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
పాక్ కేబినెట్లో చోటు దక్కించుకున్న దర్శన్‌లాల్ నాలుగు ప్రావిన్స్‌లకు సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. మిర్పూర్ మాథెలో పట్టణంలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆయన 2013లో తొలిసారి నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండోసారి పీఎంఎల్-ఎన్ టికెట్‌పై బరిలోకి దిగి విజయం సాధించారు.