: దశాబ్దాల కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ చెప్పిన బీజేపీ... రాజ్యసభలో తొలిసారి అతిపెద్ద పార్టీగా అవతరణ!
ఇంకాలం లోక్ సభలో పూర్తి మెజారిటీతో ఉండి, రాజ్యసభలో మైనారిటీలో పడి, బిల్లుల అమలు కోసం ఇబ్బందులు పడుతున్న బీజేపీ, ఇకపై ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తామనుకున్న బిల్లులను అమల్లోకి తెచ్చే స్థితిలోకి వచ్చింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. దశాబ్దాల నుంచి కొనసాగుతున్న కాంగ్రెస్ ఆధిపత్యానికి పెద్దల సభలో చెక్ చెప్పింది.
ఇటీవలే మధ్య ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికైన సంపతీయ హులికే, గురువారం నాడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడంతో, 65 ఏళ్ల పాటు రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా కొనసాగిన కాంగ్రెస్, రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు రాజ్యసభలో కాంగ్రెస్ బలం 57 కాగా, బీజేపీ బలం 58కి చేరుకుంది. వచ్చే వారంలో పశ్చిమ బెంగాల్ లో 6, గుజరాత్ లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, బీజేపీ ఆధిపత్యం మరింతగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
గుజరాత్ లో బీజేపీకి రెండు స్థానాలు ఖాయం కాగా, మరో స్థానం కోసం కాంగ్రెస్ నిలిపిన అహ్మద్ పటేల్ కు బీజేపీ గట్టిపోటీనిస్తోంది. ఇక బెంగాల్ లో ఒక స్థానం కాంగ్రెస్ కు, ఐదు తృణమూల్ కాంగ్రెస్ కు దక్కనున్నాయి. వచ్చే ఏడాదిలో 9 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, అసెంబ్లీ బలాబలాల ప్రకారం బీజేపీకి 8 స్థానాలు ఖాయంగా వస్తాయి.