: ఈ నెల 9 నుంచి నంద్యాలలో పర్యటిస్తా.. ప్రతి ఊరికి, వీధికీ వస్తా!: వైఎస్ జగన్
ఈ నెల 9 నుంచి 21వ తేదీ వరకు నంద్యాలలోనే ఉంటానని, ప్రతి ఊరికి, వీధికీ వస్తానని వైఎస్ జగన్ అన్నారు. నంద్యాల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఉప ఎన్నికలో శిల్పా మోహన్ రెడ్డిని తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని సవినయంగా చేతులు జోడించి ప్రతి ఒక్కరికీ విన్నవించుకుంటున్నానని అన్నారు. తాను అధికారంలోకి వచ్చాక రాజగోపాల్ రెడ్డికి, శిల్పా చక్రపాణిరెడ్డికి న్యాయం చేస్తానని అన్నారు.
చంద్రబాబు ఇచ్చిన పదవిని ఆయన ముఖం మీద కొట్టమని చక్రపాణి రెడ్డికి చెప్పానని, అలా చేస్తేనే, దేవుడు తమను ఆశీర్వదిస్తాడని, న్యాయానికి, ధర్మానికి మనం ప్రతినిధులం అవుతామని ఆయనకు చెప్పానని అన్నారు. తాను చెప్పిన ఆ మాటలకు కట్టుబడ్డ చక్రపాణి, ఓ మంచి మనిషిగా బయటకు వచ్చారని, స్పీకర్ ఫార్మాట్ లో మండలి చైర్మన్ కు చక్రపాణి రెడ్డి రాజీనామా లేఖ రాసి తనకు ఇచ్చి, తననే పంపించమన్నారని జగన్ చెప్పారు. ఈ విధంగా చేసిన ‘చక్రపాణి రెడ్డి అన్నను పులి, సింహం’ అందామంటూ జగన్ ప్రశంసించారు.