: లక్నోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాట... పెరుగుతున్న ధరలకు కాంగ్రెస్ నిరసన!
`అరకేజీ టమాటాలను డిపాజిట్ చేస్తే ఆరు నెలల తర్వాత కేజీ టమాటాలు ఇస్తాం`... అంటూ `స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాట` పేరుతో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు లక్నోలో ఓ బ్యాంక్ ప్రారంభించారు. ఇది కాస్త వ్యంగ్యంగా కనిపించినా, రోజురోజుకీ పెరుగుతున్న టమాట ధరలకు నిరసన తెలపడానికి వారు ఈ వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ బ్యాంకులో టమాటాల కోసం లాకర్లు, టమాటాలు తాకట్టు పెట్టుకుని లోన్లు, పేదవారికి ప్రత్యేక వడ్డీరేట్ల సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని బ్యాంకుల్లాగే ఇది కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తుందని వారు తెలిపారు. మార్కెట్లో టమాట ధరల పట్ల నిరసన తెలియజేయడానికి, ఈ బ్యాంకులో టమాటాలు డిపాజిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.