: స్నేహానికి సరికొత్త నిర్వచనం!.. ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితురాలి వ్యథ తెలుసుకుని కాలేయం ఇచ్చి కాపాడిన పూర్వ స్నేహితుడు!


కాలేయ వ్యాధితో బాధపడుతున్న స్నేహితురాలిని ఫేస్‌బుక్‌లో చూసి గుర్తించిన స్నేహితుడు వెంటనే ఆమెను చేరుకుని, కాలేయ దానం చేసి ఆమె ప్రాణాలు రక్షించాడు. ఢిల్లీలో జరిగిందీ ఘటన. ఢిల్లీకి చెందిన పూజా భట్నాగర్ (44) గత 17 ఏళ్లుగా కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. ఇక మందులతో ఆమె బతకడం కష్టమని లివర్ మార్పిడి ఒక్కటే పరిష్కారమంటూ వైద్యులు చేతులెత్తేశారు. దీంతో కుటుంబ సభ్యులు కాలేయ దానం చేసే వారి కోసం బంధువుల్లో ప్రయత్నించారు. అయితే ఎవరి కాలేయమూ ఆమెకు సరిపోదని తేలింది. దీంతో భట్నాగర్ ఫేస్‌బుక్ పేజీ ద్వారా కాలేయం కోసం అభ్యర్థించారు.

తన ప్రాణాలు కాపాడమంటూ ఫేస్‌బుక్‌లో  భట్నాగర్ వేడుకోలును చూసి చలించిపోయిన చెన్నైలో ఉంటున్న ఆమె పాత స్నేహితుడు ప్రసన్న గోపీనాథ్ వెంటనే ఢిల్లీ చేరుకుని తన కాలేయం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. ఆపరేషన్ కోసం కొందరు నిధులు పోగు చెయ్యడంతో జూలై 21న సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో కాలేయ మార్పిడిని వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ సందర్భంగా భట్నాగర్‌తో తనకున్న స్నేహాన్ని గోపీనాథ్ గుర్తు చేసుకున్నాడు. 2007లో అంటే పదేళ్ల క్రితం వేల్స్‌లోని గ్లామోర్గాన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తాను పూజా దంపతులతో కలిసి  ఫ్లాట్‌‌ను షేర్ చేసుకున్నట్టు తెలిపారు. ఆమె తనకు కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్నారు. ఆమె అంతబాధలో ఉందని తెలిసి తానెలా చూస్తూ ఉండగలనని ప్రశ్నించారు.

34 ఏళ్ల గోపీనాథ్ ప్రస్తుతం చెన్నైలో శునకాల శిక్షకుడిగా ఉన్నారు. బ్రిటన్‌లో విద్యాభ్యాసం పూర్తయ్యాక 2009లో ఇండియా తిరిగొచ్చారు. భారత్ వచ్చాక గురుగ్రామ్‌లో ఉంటున్న భట్నాగర్‌తో టచ్‌లో ఉండేవారు. కాగా, లివర్ ఇచ్చేందుకు గోపీనాథ్ ముందుకొచ్చినా ఆపరేషన్ కోసం రూ.25 లక్షలు అవసరమైందని, అంతడబ్బు తన వద్ద లేదని పూజ భర్త అనురాగ్ భట్నాగర్ పేర్కొన్నారు. అయితే గురుగ్రామ్‌లోని పూజ విద్యార్థులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి నిధులు సేకరించారని,  ప్రపంచవ్యాప్తంగా మొత్తం 363 మంది డబ్బలు పంపడంతో ఆపరేషన్ పూర్తయిందని వివరించారు. ఒకటి రెండు రోజుల్లో పూజ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకోనున్నారు. స్నేహితురాలికి తన లివర్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన గోపీనాథ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. స్నేహానికి సరికొత్త నిర్వచనం చెప్పారని కొనియాడుతున్నారు.

  • Loading...

More Telugu News