: అన్న బ్రహ్మానందరెడ్డి మాటలకు అఖిలప్రియ భావోద్వేగం!
నంద్యాల ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు, బ్రహ్మానందరెడ్డి భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన బాబాయ్ భూమా నాగిరెడ్డి ఆశయాలను నెరవేర్చుతానని, మంచి పేరు తీసుకువస్తానని..తన చెల్లెలు అఖిలప్రియకు వెన్నంటి ఉంటానని, కుటుంబానికి అండగా ఉంటానని అనడంతో అఖిలప్రియ భావోద్వేగం చెందారు. తన తండ్రి గుర్తుకురావడంతో అఖిలప్రియ కళ్లు చెమ్మగిల్లాయి. కాగా, భూమా నాగిరెడ్డి తనకు నేర్పించింది రెండే రెండు విషయాలని, ఒకటి.. ప్రజల ప్రేమాభిమానాలు పొందడం, రెండోది.. ధైర్యంగా ఉండటం అని ఆయన అన్నారు. ఈ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని బ్రహ్మానందరెడ్డి దీమా వ్యక్తం చేశారు.