: సరిహద్దు ఖాళీ చేయమంటే భారత్ సాకులు చెబుతోంది: చైనా ఆరోపణ
సిక్కిం సరిహద్దులోని డోక్లాం ప్రాంతంలోని భారత సైన్యాలను వెనక్కి పిలవమంటే భారత్ సాకులు చెబుతోందని చైనా ఆరోపించింది. ఈ విషయంలో చైనా నిగ్రహాన్ని భారత్ పరీక్షిస్తోందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. గత జూన్ నెలలో భారత సైన్యాలు అక్రమంగా చైనాలో ప్రవేశించాయని, తమ భూభాగాన్ని వారి భూభాగంగా చిత్రీకరిస్తోందని మండిపడింది. తాము రోడ్డు నిర్మించుకోకుండా నిలువరిస్తోందని చెప్పింది. వీలైనంత త్వరగా తమ సైన్యాలను వెనక్కి పిలవాలని చైనా విదేశాంగ శాఖ కోరింది.
ఇక, గత నెలన్నర రోజులుగా డోక్లాం ప్రాంతం విషయంలో భారత్-చైనాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు ప్రత్యక్ష చర్చలకు ఇంకా సిద్ధం కాలేదు. ఎవరికి వారు తమ సైన్యాలను వెనక్కి పిలవడానికి సంకోచిస్తుండడంతో ఈ వివాదంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కానీ చైనా మాత్రం తమ అధికార మీడియాలో రోజుకో రకంగా భారత్‌ను దుయ్యబడుతున్న విషయం తెలిసిందే.