: శిల్పా చక్రపాణిరెడ్డిని చేర్చుకుంటున్న వైసీపీకి ఝలక్ ఇవ్వనున్న కాటసాని?
శిల్పా చక్రపాణిరెడ్డిని చేర్చుకుంటున్న వైసీపీకి ఆ పార్టీ బనగానపల్లి ఇన్ ఛార్జ్ కాటసాని రామిరెడ్డి ఝలక్ ఇవ్వబోతున్నారని సమాచారం. నంద్యాల ఉప ఎన్నికలో టికెట్ ను శిల్పా మోహన్ రెడ్డికి ఇవ్వడంతో... టికెట్ పై ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఎన్నికల బరిలో వైసీపీ తరపున రాజగోపాల్ రెడ్డి ఉంటారని గతంలో కాటసాని ప్రకటించారు. అయితే, టీడీపీని వీడి వైసీపీలో చేరిన శిల్పాకు టికెట్ ఇవ్వడంతో ఆయన షాక్ అయ్యారు. వాస్తవానికి నంద్యాల ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కాటసాని మొదట్లో ప్రయత్నించారట. ఈ నేపథ్యంలో, ఆయనకు జగన్ క్లాస్ పీకారట. దీంతో, కాటసాని తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొనడం లేదు. పార్టీకి చెందిన నేతలను కూడా కలవడం లేదు. ఇప్పుడు ఇది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు తన కుమార్తె కోరిక మేరకు ఆయన తన అల్లుడైన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతు తెలుపుతున్నారని సమాచారం. రేపు జగన్ నంద్యాల వెళుతున్నారు. ఈ సందర్భంగానైనా కాటసాని వస్తారా? లేదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఏదేమైనప్పటికీ, వైసీపీకి కాటసాని దూరంగా జరుగుతున్నారనే వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.