: కర్ణాటక మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు... రూ. 7.5 కోట్లు స్వాధీనం
ఢిల్లీలోని కర్ణాటక ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ బుధవారం సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో రూ. 5 కోట్ల నగదు, రూ. 2.5 కోట్ల విలువైన ఆస్తులు పట్టుబడ్డాయి. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పలు ఆరోపణలు ఎదుర్కుంటున్న 44 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆశ్రయం ఇచ్చారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. రైడింగ్ జరుగుతున్న సమయంలో ఈ 44 మంది ఎమ్మెల్యేలతో కలిసి శివకుమార్ కూడా ఒక రిసార్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ వారికి దొరకకుండా ఉండేందుకే ఈ 44 మంది ఎమ్మెల్యేలకు ఆయన రిసార్టులో ఆశ్రయం కల్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అకస్మాత్తుగా జరిపిన ఐటీ దాడులపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇందుకు సమాధానంగా తాము కేవలం మంత్రి ఇంట్లోనే సోదా చేశామని, 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే గురించి తమకు తెలియదని ఐటీ శాఖ బదులిచ్చింది. ఢిల్లీ, కర్ణాటకల్లో మంత్రికి సంబంధించిన 39 ప్రదేశాల్లో 120 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు ఐటీ శాఖ ప్రతినిధులు తెలిపారు.