: గోవాలో ఆ ఆనందానికి ఇక చెక్.. చీర్స్ చెబితే జైలే గతి!
ఆనందానికి భూతల స్వర్గంగా భావించే గోవాలో పర్యాటకులకు షాకిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బీచుల్లో మద్యం తాగుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ప్రభుత్వం అసెంబ్లీకి తెలిపింది. అవసరమైతే అరెస్ట్ చేస్తామని పేర్కొంది. బీచ్‌లు పరిశుభ్రంగా ఉండాలి తప్పితే అక్రమాలకు నెలవు కాకూడదని పేర్కొంది. అందులో భాగంగానే బీచుల్లో మద్యం తాగడాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. మద్యం తాగుతూ పట్టుబడితే అవసరమైతే అరెస్టులకు కూడా వెనకాడబోమని పర్యాటక శాఖామంత్రి మనోహర్ అజ్‌గావోంకర్ అసెంబ్లీకి తెలిపారు.
బీచుల్లో మద్యం తాగుతున్న వారిపై పోలీసులు ఇప్పటికే కొన్ని కేసులు నమోదు చేసినట్టు మంత్రి వివరించారు. టూరిస్ట్ ట్రేడ్ చట్టం ప్రకారం మరిన్ని అధికారాలు వచ్చి చేరాయని, కాబ్టటి తీరంలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా వెంటనే సమాచారం అందించాలని టూరిస్ట్ గార్డులను మంత్రి ఆదేశించారు. బీచ్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఈ మేలో ఆదేశాలు వెళ్లాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ శాసనసభ్యుడు అలీగ్జో రెగినాల్డో అసెంబ్లీలో లేవనెత్తడంతో మంత్రి స్పందించి పై విధంగా వివరణ ఇచ్చారు.