: హిజ్బుల్ చీఫ్ సలాహుద్దీన్ ఉగ్రవాది కాదట!.. వెనకేసుకొచ్చిన పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్!
పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ఉగ్రవాది కాదని భారత్‌లో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సెలవిచ్చారు. కశ్మీరీల స్వయం నిర్ణయాధికార హక్కును పొందేందుకు ఆయన కృషి చేస్తున్నారని సన్నాయి నొక్కులు నొక్కారు. సలాహుద్దీన్‌ను అమెరికా ఇటీవలే ‘ప్రపంచ ఉగ్రవాది’గా ప్రకటించిన నేపథ్యంలో బాసిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాకిస్థాన్ వైపు నుంచి చూస్తే సలాహుద్దీన్ ఉగ్రవాది కాదని బాసిత్ తేల్చి చెప్పారు. అమెరికా అతడిని ‘గ్లోబల్ టెర్రరిస్ట్’గా ముద్రవేయడాన్ని తాము అంగీకరించబోమన్నారు.
కాగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు సలాహుద్దీన్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. సలాహుద్దీన్ నేతృత్వంలో భారత్‌లో పలు ఉగ్రదాడులు జరిగాయి. ఏప్రిల్, 2014లో జమ్ముకశ్మీర్‌లో జరిగిన పేలుడులో 17 మంది మృతి చెందారు. అంతేకాదు ఆత్మాహుతి దాడులతో భారత్‌ను భయపెడతానని పలు సందర్భాల్లో సలాహుద్దీన్ హెచ్చరించాడు. అంతేకాదు కశ్మీర్ లోయను భారత సైనికుల కోసం శ్మశానంగా మారుస్తానని ప్రగల్భాలు పలికాడు.