: 31 ఏళ్ల కొడుకు చనిపోయాడని.. 64 ఏళ్ల వయసులో మరో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!


చేతికి అందివచ్చిన కుమారుడిని కోల్పోయిన దుఖంలో నుంచి వేగంగానే కోలుకున్న ఆ మాతృమూర్తి విషాదం నుంచి తేరుకుని, 64 ఏళ్ల వయసులో మరో కుమారుడికి జన్మనిచ్చింది. అయితే ఇప్పుడా బిడ్డ భవిష్యత్ ఏంటన్న అనుమానాలను స్వయంగా వైద్యులే లేవనెత్తుతున్నారు. ఢిల్లీకి చెందిన చమేలీ మీనా (64), జగదీశ్ మీనా (65) భార్యాభర్తలు. వీరికి ఉన్న ఒకే ఒక్క కుమారుడు 2015లో 31 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మృతి చెందాడు. దీంతో ఒంటరి వారైన దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్నదే తడవుగా ‘ఇన్ విట్రో ఫెర్టిలైజేసన్ (ఐవీఎఫ్)ను ఆశ్రయించారు. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకునే వారమని జగదీశ్ మీనా తెలిపారు. ఆ వయసులో ఐవీఎఫ్ కోసం ఆశ్రయించిన తొలి జంట వీరేనని ఐవీఎఫ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అనూప్ గుప్తా తెలిపారు. చమేలీ మీనా ఆరోగ్యంగా ఉండడంతో ఐవీఎఫ్ ద్వారా ముందుకెళ్లినట్టు తెలిపారు. అయితే 60 ఏళ్లు దాటాక ఓ జంట తమను ఆశ్రయించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. కాగా, ఐవీఎఫ్ విజయవంతం కావడంతో ఈ ఏడాది మార్చిలో చమేలీ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాబుకి అర్మాన్ అని నామకరణం చేశారు.

గతేడాది హరియాణా నేషనల్ ఫెర్టిలిటీ సెంటర్‌లో 72 ఏళ్ల పంజాబీ మహిళ ఓ బాబుకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇక చమేలీ జన్మనిచ్చిన ఆర్మాన్ విషయానికి వస్తే.. బాబు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నట్టు డాక్టర్ మజుందార్ పేర్కొన్నారు. ఫెర్టిలిటీ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేకంగా ఎటువంటి చట్టం లేదని పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కొన్ని నిబంధనలు విధించినా అవి అమలు కావడం లేదన్నారు. అంతేకాక, ఐవీఎఫ్‌ కోసం వచ్చే వారికి గరిష్ట వయసు ఎంత ఉండాలో అన్న విషయంలో స్పష్టత లేదన్నారు. 40-50 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చినా  పెద్దగా సమస్య ఉండదని, కానీ 60 ఏళ్ల వయసులో పుడితే ఆ బాబు భవిష్యత్‌ ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందని ముజుందార్ వివరించారు.

  • Loading...

More Telugu News