: నీ దేశమే వస్తున్నా... నీ బెల్టుతో పాటు నాది కూడా తీసుకెళ్తా... చైనా సత్తా చూపిస్తా!: భారత బాక్సర్ కు చైనా బాక్సర్ హెచ్చరికలు
ప్రొఫెషనల్ బాక్సింగ్ లో ప్రవేశించిన తరువాత ఓటమి ఎరుగని ఆటగాడిగా నిలిచిన విజేందర్ సింగ్ చేసిన ‘చైనా ప్రొడక్ట్’ వ్యాఖ్యలపై ప్రత్యర్థి, చైనా ప్రొఫెషనల్ బాక్సర్ జుల్ఫికర్ మైమైతియాలి ఘాటుగా స్పందించాడు. మొన్న విజేందర్ మాట్లాడుతూ, ‘నా కోసం ప్రార్థించండి. మరో నాకౌట్ చేసేందుకు 100 శాతం పోరాడతా. ప్రత్యర్థి (జుల్ఫికర్)ని 45 సెకన్లలో నాకౌట్ చేసేందుకు ప్రయత్నిస్తా. ఎందుకంటే చైనా ఉత్పత్తులు ఎక్కువ కాలం మన్నికగా ఉండవు మరి!’ అంటూ రెచ్చగొట్టాడు. అతనిని రెచ్చగొట్టడం ద్వారా ఒత్తిడి పెంచాలన్న విజేందర్ వ్యూహం ఫలించింది.
దీంతో అతని వ్యాఖ్యలపై స్పందించిన జుల్ఫికర్ ‘చైనీయుల సత్తా ఏంటో విజేందర్ కు చూపిస్తా. సమయం వచ్చినప్పుడు చైనా సామర్థ్యం ఏంటో చూపించాం. విజేందర్ గుణపాఠం నేర్చుకోవడానికి సమయం ఆసన్నమైంది. 'విజేందర్.. ఆగస్టు 5న మీ ఇంటికొస్తున్నా. నా బెల్ట్ తో పాటు మీ బెల్ట్ కూడా తీసుకెళ్తా. తొలి రౌండ్లలోనే నిన్ను ఓడిస్తా’ అంటూ ఘాటుగా సమాధానం చెప్పాడు. కాగా, వీరిద్దరూ ముంబై వేదికగా ఆగస్టు 5న తలపడనున్నారు. ఈ పోరాటానికి ప్రొఫెషనల్ బాక్సింగ్ ‘బ్యాటిల్ గ్రౌండ్ ఆసియా’ అని పేరు కూడా పెట్టింది. దీంతో ఈ బౌట్ పై ఆసక్తి రేగుతోంది. డోక్లాంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పోరాటాన్ని రెండు దేశాల పోరాటంగా అభిమానులు పేర్కొంటున్నారు.