: కమలహాసన్ కు మద్దతిచ్చి, స్వాగతం పలికిన ఖుష్బూ
‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తున్న విశ్వనటుడు కమలహాసన్ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై తీవ్రమైన చర్చ నడుస్తున్న వేళ... తమిళనాడులోని రాజకీయ పార్టీలు, నేతలపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఈయన కూడా రాజకీయాల్లోకి వస్తారా? అనే ఆలోచన అందరికీ కలిగేలా కమల్ వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ స్పందిస్తూ, కమలహాసన్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తానని అన్నారు. ఆయనకు మద్దతు పలుకుతానని, అవినీతికి వ్యతిరేకంగా కమల్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తానని అన్నారు. కమల్ కు తన మద్దతు, అభిమానం ఎప్పుడూ ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. కాగా, 'సంఘమిత్ర' సినిమానుంచి తప్పుకున్న కమల్ కుమార్తెపై ఇటీవల ఆమె విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.