: '2019లో సీటు గ్యారెంటీ' అంటేనే టీడీపీలో ఉంటా: సీఎం రమేష్ కు స్పష్టంగా చెప్పిన శిల్పా చక్రపాణిరెడ్డి
తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు శ్రీశైలం అసెంబ్లీ సీటు గ్యారెంటీగా ఇస్తామని చెబితేనే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని, లేకుంటే రాజీనామా చేసి వైకాపాలోకి వెళ్లడం మినహా మరో మార్గం కనిపించడం లేదని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, తనను బుజ్జగించేందుకు వచ్చిన ఎంపీ సీఎం రమేష్, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
శ్రీశైలం టికెట్ పై అధిష్ఠానం స్పష్టమైన హామీ ఇస్తే మాత్రమే పార్టీ మారే ఆలోచన విరమించుకుంటానని ఆయన చెప్పినట్టు సమాచారం. ఇదిలావుండగా, నిన్న తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డితో కలసి సుమారు రెండు గంటల పాటు మాట్లాడిన ఆయన, అనంతరం మీడియా ముందుకు వచ్చి, తెలుగుదేశం నేతలు తనపై పొమ్మనలేక పొగబెడుతున్నారని, పార్టీ మారుతున్నానని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను టీడీపీలోనే ఉన్నా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు.