: ప్రతిపక్షం అన్నింటికీ అడ్డంకులేస్తోంది... పవన్ కల్యాణ్ వద్ద చంద్రబాబు ఆవేదన!


ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ ప్రతిదానికీ అడ్డుపుల్లలు పెడుతోందని సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్ద ఆవేదనను వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి, పోలవరానికి అడ్డు పుల్లలు పెడుతున్నారని, రాజధాని నిర్మిస్తున్నది తానొక్కడినే ఉండేందుకన్నట్టు ప్రవర్తిస్తున్నారని చెప్పిన చంద్రబాబు, ఇటువంటి విపక్షం ఏ రాష్ట్రంలోనూ లేదని పవన్ వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. నిన్న దాదాపు గంట పాటు ఏకాంతంగా భేటీ అయి పలు విషయాలను వీరిద్దరూ చర్చించుకోగా, కాపులకు రిజర్వేషన్ నుంచి నంద్యాల ఎన్నికల వరకూ పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.

సచివాలయాన్ని నిర్మించిన తరువాత పవన్ తొలిసారిగా అమరావతికి రాగా, స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికిన చంద్రబాబు, ఆప్యాయంగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లారు. హార్వార్డ్ ప్రొఫెసర్లు రావడానికి సమయం పడుతుందని తెలుసుకున్న చంద్రబాబు, పవన్ ను తన కార్యాలయంలోకి తీసుకెళ్లారు. కాపుల రిజర్వేషన్లపై ముద్రగడ వైఖరి, గతంలో కాంగ్రెస్ పాలనలో సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి ఇచ్చిన జీవోను కోర్టు కొట్టివేసిన వైనాలను చంద్రబాబు గుర్తు చేసినట్టు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త రాష్ట్రాన్ని సగర్వంగా నిలిపేందుకు తాను అనునిత్యమూ కష్టపడుతుంటే, విపక్షాలు తనపై కక్షతో అడ్డుకుంటున్నాయని చంద్రబాబు బాధపడ్డారు. వరల్డ్ బ్యాంకు నుంచి నిధులు తేవాలని భావిస్తే, వద్దని లేఖలు పంపారని, తమపై కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఇలా అభివృద్ధికి అడ్డుపడటం ఏంటని పవన్ వద్ద ఫిర్యాదు చేశారు. పోలవరం పూర్తయ్యేలోపే నీరివ్వాలన్న ఉద్దేశంతో పట్టిసీమను తలపెడితే, అది రాకుండా ఎన్నో చేశారని అన్నారు. ఈ సమావేశం తరువాత హార్వార్డ్ ప్రొఫెసర్లతో సమావేశానికి ఇరువురూ వెళ్లారు.

  • Loading...

More Telugu News