: స్నాప్ డీల్ ఉద్యోగులకు షాక్... 80% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
ప్లిప్ కార్ట్ తో విలీన ఒప్పందం కుదరకపోవడంతో వ్యాపారంలో ఒంటరిగానే ముందుకు సాగాలని స్నాప్ డీల్ నిర్ణయించుకుంది. సంస్థ విలీనానికి ఫ్లిప్ కార్ట్ 950 మిలియన్ డాలర్లు ఇవ్వజూపగా, సంస్థ విలువను అంచనా వేయడంలో విఫలమయ్యారంటూ ఫ్లిప్ కార్ట్ మదుపర్లు ఒప్పందాన్ని అంగీకరించలేదు. దీంతో విలీన ఒప్పందం పూర్తి కాకుండానే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో సంస్థ మళ్లీ తిరిగి వ్యాపారంలో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు వ్యయాలను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కోత విధించనుందని తెలుస్తోంది.
సుమారు 80 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని స్నాప్ డీల్ నిర్ణయించుకుంది. స్నాప్ డీల్ లో ప్రస్తుతం 1200 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. స్నాప్ డీల్ తాజా నిర్ణయంతో సుమారు వెయ్యిమంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. తొలగించాల్సిన ఉద్యోగుల జాబితా తయారు చేయాలని ఆయా విభాగాధిపతులకు మేనేజ్ మెంట్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. గత ఏడాది జూలై ముగిసే సరికి స్నాప్ డీల్ లో 9,000 మంది ఉద్యోగులు ఉండగా, ఈ ఏడాది జూలై నాటికి వారి సంఖ్య 1200కి పడిపోయింది. తాజా నిర్ణయంతో వారి సంఖ్య 200కి పడిపోనున్నట్టు తెలుస్తోంది.