: 2 గంటల్లో 245 కి.మీ.లు ... త్వరలో ఫలించనున్న భారతీయ రైల్వే ప్రయత్నం
ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ - చంఢీగడ్ మధ్య ఉన్న 245 కి.మీ.ల రైల్వే మార్గాన్ని 2 గంటల్లో ప్రయాణించే సదుపాయం కల్పించేందుకు భారతీయ రైల్వే చేస్తున్న ప్రయత్నం త్వరలో ఫలించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫ్రెంచ్ రైల్వే సహకారం కోరిన భారతీయ రైల్వేకు వారు అన్ని రకాల వివరాలతో ప్రాథమిక నివేదికను పంపించారు. అక్టోబర్‌లోగా ఖర్చు, డిజైన్‌కు సంబంధించిన తుది నివేదికను పంపనున్నట్లు సమాచారం.
దేశంలో మొదటి హై-సెమీ స్పీడ్ రైలు తీసుకురావడం కోసం ఢిల్లీ - చంఢీగడ్ మార్గాన్ని భారతీయ రైల్వే ఎంచుకుంది. ఈ మార్గంలో 32 కి.మీ. మేర మలుపులు ఉన్నాయి. మొదట వాటిని సరిచేయడానికి భూసేకరణ చేపట్టాలనుకుంది. అందువల్ల జాప్యం జరిగే అవకాశం ఉండటంతో ఆయా మలుపుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఫ్రెంచ్ రైల్వే సహకారం కోరింది. వారు ఈ మార్గాన్ని అధ్యయనం చేసి భూసేకరణ అవసరం లేకుండానే రైలు మార్గాన్ని అభివృద్ధి చేసే మార్గాలు సూచించారు. ఇందుకు సంబంధించిన నివేదికల్లో ప్రాథమిక నివేదికను అందజేయడంతో ఏడాదిలోగా ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.