: ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ల మధ్య నో డీల్... స్పష్టత ఇచ్చిన స్నాప్‌డీల్
గత ఆరు నెలలుగా ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ల విలీనం జరుగుతుందా? లేదా? అని తెలుసుకోవడానికి వ్యాపార రంగం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. మొత్తానికి సుదీర్ఘ చర్చోపచర్చల తర్వాత ఎలాంటి విలీనం జరగడం లేదని స్నాప్‌డీల్ అధికారికంగా స్పష్టత నిచ్చింది. అంతేకాకుండా త్వరలో ఆన్లైన్ మార్కెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించింది. ఆన్లైన్ అమ్మకాలలో తనకు పోటీగా ఉన్న స్నాప్‌డీల్‌ను చేజిక్కించుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ అన్ని రకాలుగా ప్రయత్నించింది. మొదట 850 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసింది. తర్వాత స్నాప్‌డీల్ కోరుకున్నట్లుగా 950 బిలియన్ డాలర్లు కూడా ఇవ్వడానికి ఒప్పుకుంది. రెండోసారి డీల్‌కు స్నాప్‌డీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సుముఖత వ్యక్తం చేశారు. కానీ షేర్ హోల్డర్లు ఒప్పుకోకపోవడంతో ఒప్పందం చేజారిపోయినట్లు సమాచారం.
అంతేకాకుండా ఇటీవలే తమ రీచార్జ్ పోర్టల్ ఫ్రీచార్జ్‌ను 60 మిలియన్ డాలర్లకు యాక్సిస్ బ్యాంక్ వారికి స్నాప్‌డీల్ అమ్మింది. ఈ 60 మిలియన్ డాలర్లతో పాటు తమ బ్యాంకులో ఉన్న మరికొంత పెట్టుబడితో ఈ-కామర్స్ రంగంలో పూర్వ వైభవాన్ని సృష్టించుకునేందుకు స్నాప్‌డీల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి `స్నాప్ డీల్ 2.0` గా ఆవిష్కృతమై ఇతర ఈ-కామర్స్ వెబ్సైట్లకు స్నాప్‌డీల్ గట్టిపోటీ ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం.