: ఇండియాలో తొలిసారి... 'సూసైడ్ సెల్ఫీ' కావాలని ఆన్ లైన్ గేమ్ లో టాస్క్, ఆలోచించకుండా దూకేసిన ముంబై యువకుడు మృతి!
ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, క్లిష్టతరమైన టాస్క్ లు ఇస్తూ, ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న అండర్ గ్రౌండ్ ఆన్ లైన్ గేమ్ 'బ్లూ వేల్' ఆడుతూ, అందులో 'సూసైడ్ సెల్ఫీ' టాస్క్ కోసం నాలుగంతస్తుల భవంతి పైనుంచి దూకేశాడో తొమ్మిదో తరగతి బాలుడు. ఈ ఘటన ముంబైలో జరుగగా, ఇండియాలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని వివరాల్లోకి వెళితే, ముంబైలోని అంధేరీ ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడు ఈ గేమ్ ను ఆడుతున్నాడు. దీన్ని లోడ్ చేసుకున్న వారు 50 టాస్క్ లను పూర్తి చేస్తూ, అందుకు సంబంధించిన సెల్ఫీలను అప్ లోడ్ చేస్తుండాలి. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఓ టాస్క్ లో చెప్పడంతో, ఎంత మాత్రమూ ఆలోచించకుండా సదరు బాలుడు దూకేశాడు. ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు కేవలం గేమ్ కారణంగా బాలుడు మరణించాడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అన్న విషయాలు తెలియాల్సి వుందని చెప్పారు.
కాగా, ఈ గేమ్ ను ఓ రష్యన్ తయారు చేసి నిర్వహిస్తుండగా, అతన్ని అరెస్ట్ కూడా చేశారు. ఈ గేమ్ ఆడుతూ పలు దేశాల్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఇండియాలో 'బ్లూ వేల్' ఆడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, దీనిపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.