: పూరీపై అభియోగాల్లో తనీష్ సాక్ష్యం కీలకమంటున్న సిట్!
డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నేడు యువ నటుడు తనీష్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఆయన సిట్ కార్యాలయానికి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి తనీష్ ను విచారించనుండగా, దర్శకుడు పూరీ జగన్నాథ్ పై వచ్చిన అభియోగాలపై తనీష్ సాక్ష్యమే అత్యంత కీలకమని తెలుస్తోంది. కెల్విన్ ఫోన్ లో తనీష్ నంబర్ ఉండటం, వారిద్దరి మధ్యా పలుమార్లు ఫోన్ సంభాషణలు, వాట్స్ యాప్ మెసేజ్ ల బట్వాడా జరిగినట్టు సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నక్షత్రం' చిత్రంలో తనీష్ నటిస్తుండగా, ఇతనికి పబ్ లకు వెళ్లే అలవాటు ఎక్కువని, నవదీప్, తరుణ్ లతో పాటు ఎన్నో మార్లు పార్టీల్లో పాల్గొన్నాడని, పూరీ జగన్నాథ్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకూ హాజరయ్యే వాడని సిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డ్రగ్స్ వ్యవహారంలో పూరీ ప్రమేయంపై ఇప్పటికే గట్టి ఆధారాలు సంపాదించామని చెబుతున్న సిట్ అధికారులు, తనీష్ సాక్ష్యం కూడా కీలకమని అంటున్నారు.