: నెహ్రూ-ఎడ్వినా మధ్య ఉన్నది అనురాగమే.. శారీరక సంబంధం కాదు!: స్పష్టం చేసిన మౌంట్ బాటెన్ కుమార్తె
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, తన తల్లి ఎడ్వినా మౌంట్ బాటెన్ మధ్య ఉన్నది పరస్పర అనురాగ బంధం మాత్రమేనని, వారిద్దరి మధ్య శారీరక సంబంధం లేదని ఎడ్వినా కుమార్తె, భారత చిట్టచివరి వైస్రాయ్ లూయిస్ మౌంట్‌బాటెన్ కుమార్తె పమేలా హిక్స్ స్పష్టం చేశారు. తన తండ్రి భారత్‌కు వైస్రాయ్‌గా వచ్చినప్పుడు తనకు 17 ఏళ్లని, అప్పుడే నెహ్రూ, తన తల్లి మధ్య బంధం బలపడుతున్నట్టు గుర్తించానని పమేలా పేర్కొన్నారు.
నెహ్రూలో ఎడ్వినా సాహచర్య మాధుర్యాన్ని, మేధో సౌందర్యాన్ని చూశారన్నారు. నెహ్రూ తన తల్లికి రాసిన లేఖల ద్వారా ఆయన అంతరంగాన్ని, తన తల్లిపై ఆయనకు ఉన్న భావాలను అర్థం చేసుకున్నానని తెలిపారు. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉందా? లేదా? అన్న విషయం తెలుసుకోవాలని తనకు ఉండేదని పమేలా పేర్కొన్నారు. అయితే నెహ్రూ లేఖలను చదివాక వారి మధ్య అటువంటి సంబంధం లేదని అర్థమైందన్నారు.
నిజానికి వారి మధ్య ఏకాంతానికి సమయమే ఉండేది కాదని వివరించారు. వారి చూట్టూ ఎప్పుడూ పోలీసులతోపాటు ఎవరో ఒకరు ఉండేవారని తెలిపారు. దేశాన్ని విడిచి వెళ్తున్నప్పుడు నెహ్రూకు తన తల్లి మరకతపు ఉంగరాన్ని ఇవ్వాలనుకున్నారని, అయితే నెహ్రూ అది తీసుకోవడానికి అంగీకరించరని తెలిసి దానిని ఆయన కుమార్తె ఇందిరకు ఇచ్చారని పమేలా పేర్కొన్నారు. జీవితంలో అనుకోని ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు ఆ ఉంగరాన్ని విక్రయించుకోవాలని తన తల్లి ఇందిరకు సూచించారన్నారు. ‘డాటర్ ఆఫ్ ఎంపైర్: లైఫ్ యాజ్ ఎ మౌంట్‌బాటెన్’ అనే పుస్తకంలో పమేలా ఈ విషయాలను ప్రస్తావించారు. 2012లో తొలిసారి బ్రిటన్‌లో ప్రచురించిన ఈ పుస్తకాన్ని హ్యాషెట్ సంస్థ భారత్‌లో విడుదల చేసింది.