: ఉద్ధానం కిడ్నీ బాధితుల సింపోజియంకు హాజరైన హార్వార్డ్ శాస్త్రవేత్తల బృందం, పవన్ కల్యాణ్!
శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారం కోసం అమెరికాకు చెందిన హార్వార్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వచ్చిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైజాగ్ వెళ్లారు. అక్కడి ఆంధ్రామెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింపోజియంలో హార్వార్డ్ యూనివర్సిటీ పరిశోధకులతో పాటు పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. సింపోజియం సందర్భంగా వైద్యుల టీం పలు సలహాలు, సూచనలు చేసింది. సమస్యను ఆదిలోనే గుర్తిస్తే పరిష్కరించడం సులభమని అన్నారు. సిలికా మినరల్స్ కలిసిన నీరు తీసుకోవడానికి తోడు, అక్కడి ప్రజల్లో నీరు తాగేే అలవాటు చాలా తక్కువగా ఉందని వారు చెప్పారు.
ఉద్ధానం ప్రజలు పౌష్టికాహారం తీసుకోవడం లేదని వారు తెలిపారు. పవన్ కల్యాణ్ కదిలిన తీరుతో ఉద్ధానం ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లభించిందని సింపోజియంలో పాల్గొన్న నిపుణులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమస్య కేవలం ఉద్ధానంలోనే లేదని, సౌత్ అమెరికా, యూరోప్ లోని కొన్ని దేశాల్లో కూడా ఉందని వారు చెప్పారు. అయితే దీని నివారణకు పరిశోధనలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఉద్ధానంలో ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల రిపోర్టులు అంతర్జాతీయ పరిశోధకులతో పంచుకుంటే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చని వారు చెప్పారు.