: ఓ పెద్ద కలను నిజం చేసుకున్నాం: నరేంద్ర మోదీ


'ఒకే దేశం - ఒకే పన్ను' అమలులోకి తీసుకురావడం ద్వారా అభ్యుదయ భారతావని ఓ సుదీర్ఘ కలను సాకారం చేసుకున్నట్లయిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆల్ ఇండియా రేడియో ద్వారా 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, జీఎస్టీని ఆర్థిక వ్యవస్థను బలపరిచే సామూహిక శక్తిగా అభివర్ణించారు. ఈ విధానం అమలుతో తక్కువ సమయంలోనే ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనిపిస్తోందని తెలిపారు. కొత్త పన్ను విధానం దేశాభివృద్ధికి కీలకమని ప్రజల్లో అవగాహన కల్పించడంలో కేంద్రం విజయవంతమైందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం, వ్యాపారులు, వినియోగదారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడిందని ఇది కేవలం పన్నుల సంస్కరణ మాత్రమే కాదని, దేశాన్ని ముందుకు నడిపించగల సామర్థ్యమున్న ఔషధమని అభివర్ణించారు.
 
వాతావరణంలో మార్పులను ప్రస్తావించిన ఆయన, ఈ మార్పులు కొన్ని చోట్ల ప్రతికూల ప్రభావాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అసోం, రాజస్థాన్, గుజరాత్, వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు, జనజీవనం అస్తవ్యస్తం కావడానికి వాతావరణ మార్పులే కారణమని అన్నారు. ఈ వర్షాలు, ఆపై వరదలు ప్రజా జీవితంతో పాటు పంటలు, మౌలిక వసతులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని తెలిపారు. నష్టపోయిన రాష్ట్రాల్లోని ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.

వరదల పరిస్థితిపై '1078' హెల్ప్ లైన్ నంబరును ఏర్పాటు చేశామని, ఈ నంబరుకు ఫోన్ చేసి ఎవరు ఫిర్యాదు చేసినా సత్వరమే అధికారులు స్పందిస్తారని అన్నారు. విపత్తులు సంభవించిన చోట తనతో పాటు కేంద్ర మంత్రులు సైతం పర్యటించి, వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు సహాయం కావాల్సిన ప్రాంతాల్లో సైనికులు, అధికారులు చర్యలు చేపట్టారని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని అన్నారు. వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా అవసరమైన ఆహారం, నిత్యావసర సరుకులను అందిస్తున్నట్టు నరేంద్ర మోదీ వెల్లడించారు. పంటలు కోల్పోయిన చోట వెంటనే బీమా సొమ్ము అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

  • Loading...

More Telugu News