: అమరావతి ప్రాంతంలో కట్టలు తెంచుకున్న కొండవీటి వాగు... ఎస్ఆర్ఎం వర్శిటీ వరకూ నీరు!
ఇటీవల నరసరావుపేట, సత్తెనపల్లి, నిడుమొక్కల, అమరావతి తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కొండవీటి వాగు పొంగి, రాజధాని ప్రాంతంలోని దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. శనివారం రాత్రి వరకూ తుళ్లూరుతో పాటు మంగళగిరి ప్రాంతాల్లోని గ్రామాల్లోకి నీరు చేరి, భూసమీకరణ చేసిన నీరుకొండ పొలాలను ముంచెత్తింది. భూ సమీకరణ అనంతరం పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఈ వాగు పొంగలేదు.
ఇక తాజా వర్షాలకు నీరుకొండలో నిర్మించిన ఎస్ఆర్ఎం యూనివర్శిటీ వరకూ వరద నీరు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వాగు నిండుగా నీరుండటం, పత్తి పంటలు మునగడంతో, ఏ మాత్రం వర్షాలు కురిసినా ఐనవోలు, యర్రబాలెం, పెనుమాక, కృష్ణాయపాలెం గ్రామాలవైపు నీరు వస్తుందని, తాత్కాలిక సచివాలయానికీ ముప్పు తప్పదని ఇక్కడి ప్రజలు అంటున్నారు. కాగా, పెదపరిమి సమీపంలోని 30 ఎకరాల పత్తి, 20 ఎకరాల అపరాల పంట నీట మునిగిందని, గ్రామంలోని రెండు కాలనీల్లోకి వరద నీరు వచ్చిందని తెలుస్తోంది.