: ఓపక్క గోపాలకృష్ణ గాంధీ ఉండగా, వెంకయ్యనాయుడు ఆత్మీయుడా?: జానారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ గుస్సా
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ బరిలో ఉండగా, బీజేపీ అభ్యర్థి వెంకయ్యనాయుడు ఆత్మీయుడు ఎలా అవుతాడని సీఎల్పీ నేత జానారెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. వెంకయ్యనాయుడికి అభినందన సభ జరుగగా, దానికి జానారెడ్డి హాజరు కావడాన్ని విమర్శించిన సీనియర్ నేత సీహెచ్, ఎన్డీయే అభ్యర్థి సభకు జానా వెళ్లడం, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకూ బాధ కలిగించిందని అన్నారు.
పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చి జానా వివరణ కోరతానని తెలిపారు. మరో నేత మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణకు వ్యతిరేకి అయిన వెంకయ్య ఆత్మీయ సభకు జానా హాజరు కావడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం జానారెడ్డి స్వయంగా వెంకయ్యనాయుడి సభకు హాజరు కావడంపై తరువాత స్పందిస్తానని చెప్పారు.