: ఆ బులెట్ తీస్తే విక్రమ్ గౌడ్ ప్రాణాలకే ప్రమాదం: డాక్టర్లు
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ వెన్నెముకలో చిక్కుకున్న బులెట్ ను బయటకు తీయాలని ప్రయత్నిస్తే, ఆయన ప్రాణాలకే ప్రమాదమని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆ బులెట్ శరీరంలోనే ఉండటం వల్ల పెద్దగా ప్రమాదమేమీ ఉండదని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపాయి. బులెట్ ను బయటకు తీయాలని చూస్తే, వెన్నుపూస శాశ్వతంగా చచ్చుబడి పోవచ్చని, మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నరాలు దెబ్బతిని ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడవచ్చని, అందువల్ల దాన్ని తీయరాదని నిర్ణయించామని తెలిపాయి.
కాగా, కాల్పులకు ఉపయోగించిన తుపాకీ మాయం కావడం వెనుక ఆయన భార్య షిఫాలీ ప్రమేయంపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరో ఇద్దరు ఆగంతుకులు వచ్చారని ఆమె చెబుతున్నప్పటికీ, కొత్తగా ఎవరూ వచ్చిన దాఖలాలు లేవని తేల్చిన పోలీసులు, తొలుత దర్గాలో అన్నదానమని, ఆపై గుడిలో అన్నదానమని మాట మార్చిన షిఫాలీ వైఖరిపైనా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే విక్రమ్ గౌడ్, షిఫాలీల స్టేట్ మెంట్లను రికార్డు చేసిన పోలీసులు, విచారణలో తమకెన్నో ప్రశ్నలు ఉదయించాయని, మరోసారి ప్రశ్నిస్తామని తెలిపారు. వీరిద్దరిపై సాక్ష్యాల తారుమారు, గన్ మాయం, అవాస్తవాలు వెల్లడించడం వంటి సెక్షన్లతో కూడిన కేసులను పెట్టనున్నట్టు వెల్లడించారు.