: మత్తు కోసం 'ఫోర్ట్ విన్' వైపు సినీ ప్రముఖులు... రూ. 5 ఇంజక్షన్ రూ. 500కు అమ్ముతున్న వైనం!


ఫోర్ట్ విన్... ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చినప్పుడు మత్తు ఇచ్చేందుకు, విపరీతమైన నొప్పుల నివారణకు వాడే ఇంజక్షన్. సాధారణంగా దీని ఖరీదు ఉత్పత్తి చేసే కంపెనీని బట్టి రూ. 5 నుంచి రూ. 12 వరకూ ఉంటుంది. కానీ కొందరు సినీ ప్రముఖులు, విద్యార్థులకు మత్తుమందులు విక్రయించే ముఠాలు ఒక్కో ఫోర్ట్ విన్ ఇంజక్షన్ ను రూ. 200 నుంచి రూ. 500 వరకూ విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చిన తరువాత కొకైన్, హెరాయిన్ వంటివి దొరకడం క్లిష్టతరం కావడంతో, కొందరు సినీ ప్రముఖులు ఫోర్ట్ విన్ కు అలవాటు పడ్డారని, ఇందులో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది.

ఇక ఈ ఇంజక్షన్లను మెడికల్ షాపుల వాళ్లు బ్లాక్ చేస్తూ, అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారం కూడా అందడంతో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దృష్టిని సారించారు. ఏపీ నుంచి తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్ కు సరఫరా అవుతున్నట్టు తెలుసుకున్న అధికారులు నిఘా పెట్టారు. ఇక ఓ వర్థమాన నటుడు ఫోర్ట్ విన్ ను వినియోగిస్తున్న వారిలో ఉన్నాడని ఎక్సైజ్ విభాగం గుర్తించింది. అసిస్టెంట్ డైరెక్టర్ మోతాదుకు మించి ఫోర్ట్ విన్ తీసుకుంటూ ఉండటంతో చెయ్యి నరాలపై ప్రభావం పడిందని, అయినా, అలవాటును మానుకోలేకపోయిన ఆయన రెండో చేతికి ఈ ఇంజక్షన్ తీసుకుంటున్నాడని అధికారులు గుర్తించారు. డ్రగ్స్ ఏ రూపంలో ఉన్నా అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రత్యేక బృందాలను అధికారులు రంగంలోకి దించి దాడులు చేయిస్తున్నారు.

  • Loading...

More Telugu News