: ఏ పెర్ఫార్మెన్స్ ను చూసి లోకేష్ కు పదవి ఇచ్చారు? ఉద్యోగుల నుంచి ఏ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నారు?: బాబును నిలదీసిన రోజా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మేకవన్నెపులి అని ఉద్యోగులకు అర్థమైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆమె మాట్లాడుతూ, ఉద్యోగులకు పెర్ఫార్మెన్స్ ఆధారంగా పాయింట్లు ఇస్తామని, వాటి ఆధారంగా వారి పని తీరును అంచనా వేసి వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం అంటున్నారని, ఈ విధానం కేవలం ఉద్యోగులకే ఎందుకని ఆమె ప్రశ్నించారు. అసలు ఏ పెర్ఫార్మెన్స్ చూసి లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చారని ఆమె నిలదీశారు. ఏ అర్హతలున్నాయని ఆయన మంత్రి అయ్యారని ఆమె ప్రశ్నించారు.
ఈ నిబంధనలు ఉపసంహరించుకోని పక్షంలో ఉద్యోగుల తరపున వైఎస్సార్సీపీ పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు. 67 ఏళ్ల చంద్రబాబు ఏ అర్హతతో ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆమె అడిగారు. ఉద్యోగులకు వయోపరిమితి నిబంధనలు ఉన్నాయని, మరి చంద్రబాబుకు ఆ అర్హతలు ఎందుకు వర్తించవని ఆమె అన్నారు. కేవలం ఉద్యోగులను హింసించే ప్రక్రియలో భాగంగా ఈ పెర్ఫార్మెన్స్ నిబంధనలను తెరపైకి తెచ్చారని ఆమె ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం మానేసి ఉద్యోగులను తీసేసేందుకు చంద్రబాబు ఉత్సాహం చూపుతున్నారని ఆమె స్పష్టం చేశారు.