: మా అమ్మాయి పెళ్లి... సెలవు ఇప్పించండి!: హైకోర్టును కోరిన రాజీవ్‌గాంధీ హంతకురాలు నళిని
రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి, గత 26 సంవత్సరాలుగా జైలు జీవితం గడుపుతున్న నళిని శ్రీహరన్ తన కూతురు పెళ్లి కోసం సాధారణ సెలవు కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవిత ఖైదు పడిన ఆమెకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నెల రోజులు సాధారణ సెలవు మంజూరు చేయాలి. కానీ ఇంతవరకు ఆమెకు ఎలాంటి సెలవు ఇవ్వలేదని, 2016లో లండన్‌లో నివసిస్తున్న తన కూతురు హరిత్రన్ పెళ్లి కోసం 6 నెలలు సెలవు ఇవ్వాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినా ఎలాంటి స్పందన లేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
గత జనవరిలో కూడా ఆమె జైళ్ల శాఖ ఐజీకి కూడా సెలవు కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లు, అక్కడి నుంచి కూడా ఏ స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. సోమవారం రోజు ఆమె పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళినికి మొదట ఉరిశిక్ష విధించారు. తర్వాత దాన్ని సుప్రీంకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. ప్రస్తుతం ఆమె వెల్లూరులోని ప్రత్యేక మహిళా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.