: 'చేతులు, కాళ్లు నరికేస్తాం.. జాగ్రత్త' అంటూ హీరో విశాల్ కు బెదిరింపులు
కోలీవుడ్ నటుడు, నడిగర సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల సంక్షేమ సంఘం అధ్యక్షుడు విశాల్ కు తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయి. నడిగర్ సంఘంలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన విశాల్ కు సిద్ధాంతపరమైన శత్రువులు ఉన్నారు. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే విశాల్...ఈ మధ్యే కర్ణాటక వెళ్లి, అక్కడ కావేరీ వివాదంపై నిర్భయంగా మాట్లాడాడు.
సినీ నటి వరలక్ష్మితో ప్రేమలో ఉన్నాడంటూ పలు మార్లు వార్తలు రాగా, తామిద్దరం మంచి స్నేహితులమని వారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో విశాల్ కు ఫోన్ బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా అవి శ్రుతి మించి కాళ్లు, చేతులు నరికేస్తామంటూ బెదిరింపులు రావడంతో విశాల్ అప్రమత్తమయ్యాడు. దీంతో, విశాల్ తరఫున నిర్మాతలు మణిమ్మరన్, మహమ్మద్ సాహిల్ చెన్నై సీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.