: భవిష్యత్ తరాలకు ఆ జాఢ్యం అంటుకునే ప్రమాదం వుందని గుర్తించాం... అందుకే, అకున్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చా: కేసీఆర్
హైదరాబాదుతో పాటు టాలీవుడ్ ను పట్టి కుదిపేస్తున్న డ్రగ్స్ దందాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో స్పందించారు. డ్రగ్స్ వ్యవహారంలో దాడులు చేయాలని తాము ఆదేశించలేదని ఆయన చెప్పారు. నకిలీ విత్తనాలు ప్రతి ఏటా సమస్యగా మారుతున్నాయని, వాటిని ఏరిపారేయాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించానని అన్నారు. అయితే నకిలీ విత్తనాల గురించి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఊహించని విధంగా డ్రగ్స్ తీగ కాలికి తగిలిందని ఆయన చెప్పారు.
దర్యాప్తు ప్రారంభించి, లోతుకి వెళితే, డ్రగ్స్ ఎంతెలా చొచ్చుకుపోయిందో తెలిసిందని, భవిష్యత్ తరాలకు ఆ జాఢ్యం అంటుకునే ప్రమాదం వుందని గుర్తించామని తెలిపారు. ఇక క్షణం ఆలస్యం చేయకుండా దానిని తుడిచిపారేయాలని సూచించానని అన్నారు. డ్రగ్స్ దందాలో ఎంతటివారున్నా వదలొద్దని చెప్పానని, విచారణలో అకున్ సబర్వాల్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చానని ఆయన చెప్పారు. తొలుత చిన్నవారు, తరువాత పెద్దవారు, ఇప్పుడు అంతర్జాతీయ స్మగ్లర్లు బయటపడుతున్నారని ఆయన గుర్తుచేశారు.