: ఏ తల్లీ తనలా క్షోభపడకూడదని కోరుతూ... యునైటెడ్ ఎయిర్ లైన్స్ పై దావా వేసిన మహిళ
యునైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థ విమానంలో తానెదుర్కొన్న నరకయాతనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హువాయికి చెందిన షెర్లి యమౌచి అనే మహిళ దావా వేశారు. బోస్టన్ లో నిర్వహించిన కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు ఆమె అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో రెండు టికెట్లు బుక్ చేసింది. రెండు టికెట్లకు డబ్బులు చెల్లించింది. అయితే ఆమె టికెట్ కన్ ఫాం అయిందని, ఆమె మూడేళ్ల కుమారుడి టికెట్ సరిగా లేదని ఆరోపిస్తూ, వేరే వ్యక్తిని ఆమె పక్క సీట్లో కూర్చోబెట్టారు. దీంతో ఆమె అవాక్కైంది. సిబ్బందిని ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో సుమారు మూడున్నర గంటలపాటు విమానంలో ఇరుకు సీట్లో కుమారుడ్ని ఎత్తుకుని కూర్చుని ప్రయాణించింది. అనంతరం ఎయిర్ లైన్స్ తీరును తన సోషల్ మీడియా ఖాతాలో కడిగిపడేసింది. ప్రయాణం ముగిసిన ఐదు రోజుల తరువాత ఆమె కొనుగోలు చేసిన టికెట్ నగదు వాపసు చేసి క్షమించమని అడిగింది. దీంతో ఆమె తీసిన టికెట్ల కాపీలు, ఎయిర్ లైన్స్ వాపసు చేసిన రుసుం వివరాలు, క్షమాపణలు చెప్పిన మెయిల్ కాపీలతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మూడున్నర గంటలపాటు బిడ్డ తల్లిపడ్డ క్షోభకు ఎయిర్ లైన్స్ చెప్పిన సమాధానం ఇదని, ఈ నిర్లక్ష్య విధానం వీడేలా ఎయిర్ లైన్స్ కు శిక్ష విధించాలని, తనలా ఏ తల్లీ క్షోభ పడకూడదని ఆమె డిమాండ్ చేస్తూ కేసు వేశారు.