: త్వరలో 4జీ వాయిస్ఎల్టీఈ సేవలు ప్రవేశపెట్టనున్న ఎయిర్టెల్
4జీ టెక్నాలజీ ద్వారా వాయిస్ కాల్స్‌ను చేసుకునే సదుపాయాన్ని ఈ ఏడాది చివర్లోగా ప్రవేశపెట్టనున్నట్లు టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ప్రస్తుతం కేవలం రిలయన్స్ జియో వారు మాత్రమే ఈ రకమైన సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే వాయిస్ ఓవర్ ఎల్టీఈ సేవలను 6 నగరాల్లో టెస్ట్ రన్ చేసినట్లు, రానున్న 6 నెలల్లో వాటిని మరిన్ని నగరాలు అభివృద్ధి చేయనున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఇండియా సీఈఓ గోపాల్ విట్టల్ చెప్పారు. రిలయన్స్ జియో రావడం వల్ల తమ లాభాలు 75 శాతం వరకు తగ్గిపోయాయని, టెలికాం మార్కెట్లో జియో ఒకరకమైన ఒత్తిడిని సృష్టించిందని, దాన్ని ఎదుర్కోవడానికే 4జీ వాయిస్ సేవలు ప్రవేశపెడుతున్నట్లు ఆయన వివరించారు. త్వరలో రిలయన్స్ వారు ప్రవేశపెట్టనున్న 4జీ ఫీచర్ ఫోన్‌పై కూడా ఆయన స్పందించారు. `ఎయిర్‌టెల్‌కు అలాంటి ఫోన్లు ప్రవేశపెట్టే యోచన లేదు. వారి 4జీ ఫీచర్ ఫోన్ వల్ల 4జీ రంగంలో కొత్త విప్లవం వస్తుంది. దీని వల్ల ఇతర ఫోన్ల కంపెనీలు కూడా తక్కువ ధర ఫోన్లను తయారుచేస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఫోన్ల తయారీ కంపెనీలతో మాకు ఒప్పందం ఉంది. కాబట్టి మాకు అవకాశం దొరికినపుడు మేం కూడా వినియోగదారులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తాం` అని విట్టల్ అన్నారు. జియో 4జీ ఫోన్ విడుదలయ్యాక దానిపై వినియోగదారుల అభిప్రాయాన్ని బట్టి తమ తర్వాతి చర్యలను నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.