: రోడ్డెక్కిన లాలు మద్దతుదారులు.. మహాత్మాగాంధీ సేతు దిగ్బంధనం.. 11 గంటలకు గవర్నర్‌తో ఆర్జేడీ ఎమ్మెల్యేల భేటీ!
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)తో తెగదెంపులు చేసుకున్న నితీశ్ బీజేపీ చేయి అందుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడంపై మండిపడుతున్న లాలు మద్దతుదారులు ఈరోజు రోడ్డెక్కారు. పాట్నాతో ఉత్తర బీహార్‌ను కలిపే మహాత్మాగాంధీ సేతును దిగ్బంధించారు. మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తేజశ్వీయాదవ్ తన మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేసేందుకు గవర్నర్ బంగ్లా వైపు వస్తుండడంతో గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి మనసు మార్చుకున్నారు. తేజశ్వీ యాదవ్ సహా మరో ఐదుగురు ఆర్జేడీ ఎమ్మెల్యేతో చర్చలకు సిద్ధమని వర్తమానం పంపారు.
ఈ సందర్భంగా తేజశ్వీ మీడియాతో మాట్లాడుతూ ఆర్జేడీ అతిపెద్ద పార్టీ కావడంతో గవర్నర్ తొలుత తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. నితీశ్ రంగులు మారుస్తున్నారంటూ తేజశ్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ ఫైరయ్యారు. కాగా, నిజానికి నితీశ్ ముఖ్యమంత్రిగా నేటి సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఆర్జేడీ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. దీంతో నితీశ్ ప్రమాణ స్వీకారాన్ని ఉదయం పది గంటలకు మార్చారు.