: బీజేపీ-నితీశ్ బంధం.. కాషాయానికి బలం!
గ్రాండ్ అలయన్స్‌కు టాటా చెప్పిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో జతకట్టడంతో కాషాయ పార్టీ మరింత బలోపేతమైంది. 2019 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఉత్తరప్రదేశ్, బీహార్‌లో మరింత పట్టు పెంచుకునేందుకు నితీశ్ స్నేహం చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 120 లోక్‌సభ స్థానాలున్నాయి. నితీశ్ చేరికతో వీటిపై పట్టు సాధించవచ్చని బీజేపీ భావిస్తోంది. యూపీలో ఎస్పీ, బీఎస్పీ, బీహార్‌లో ఆర్జేడీలను కకావికలు చేసే అవకాశం దక్కిందని సంబరపడుతోంది.
ఇక జేడీయూ తమతో తెగదెంపులు చేసుకోవడంతో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ఇప్పుడు చిన్న పార్టీలతో జతకట్టేందుకు వెంపర్లాట మొదలుపెట్టారు. 2015లో జేడీయూ నుంచి బయటకు వచ్చిన జితన్ మాంఝీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ నేత ఉపేంద్ర కుష్వాహతో చెలిమికి సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎలానూ ఆర్జేడీతోనే ఉండడంతో ఇతర పార్టీలతో కలిసి తన బలాన్ని పెంచుకునేందుకు లాలు ప్రయత్నిస్తున్నారు.
ఇక బీజేపీ 2014 ఎన్నికల్లో మిత్రులతో కలిసి బీహార్‌లో 40 సీట్లకు గాను 31 సీట్లు గెలుచుకుంది. అయితే 2015లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ చేతులు కలపడంతో బీజేపీకి ప్రతిబంధకంగా మారింది. తాజాగా నితీశ్ బీజేపీ సాయాన్ని అర్థించడంతో 2019 ఎన్నికల నాటికి బలపడి సత్తా చాటాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలను ఒక్కటి చేసేందుకు లాలు ప్రసాద్ యాదవ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మహాఘట్బంధన్ నుంచి నితీశ్ వెళ్లి పోవడంతో యాంటీ బీజేపీ క్యాంప్ తయారీకి రంగం సిద్ధమైంది.