: విశాఖలోని పలు కాలేజీల్లో డ్రగ్స్ వాడుతున్నారు.. వార్నింగ్ ఇచ్చాం!: మంత్రి గంటా
విశాఖ నగరంలోని పలు కాలేజీల్లో డ్రగ్స్ వాడుతున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయమై తమకు సమాచారం ఉందని, ఆయా కాలేజీల యాజమాన్యాలను ఇప్పటికే హెచ్చరించామని చెప్పారు. నియంత్రించని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని వారికి తెలియజెప్పామని అన్నారు. ఈ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతోందని, దీనిని అరికట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ పూర్తిగా నియంత్రించలేకపోతున్నామని చెప్పారు.
ఇటీవల జరిగిన సమావేశంలో గంజాయి నియంత్రణ విషయమై సీఎం చంద్రబాబు ప్రస్తావించారని, అవసరమైతే డ్రోన్స్, హెలికాప్టర్ కూంబింగ్ లు నిర్వహించాలని ఆయన ఆదేశించారని చెప్పారు. కేవలం, చిన్న చిన్న కేసులు పెట్టి డ్రగ్స్ వ్యవహారాన్ని ‘మమా’ అనిపించొద్దని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. గంజాయిసాగు వెనుక ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా వదిలి పెట్టవద్దని, డ్రగ్స్ కు సంబంధించి హైదరాబాద్ లా విశాఖ మారకముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తమ అధినేత ఆదేశించారని అన్నారు.