: ఎలాంటి ఆధారం లేకుండా చనిపోయారని చెప్పడం మహాపాపం: సుష్మా స్వరాజ్
ఇరాక్‌లో తప్పిపోయిన 39 మంది భారతీయులు బ్రతికే ఉన్నారని చెప్పి పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. `ఎలాంటి ఆధారం లేకుండా వారు చనిపోయారని చెప్పడం పాపం. ఆ పాపం నేను చేయాలనుకోవడం లేదు. కావాలంటే వాళ్లు చనిపోయారన్న విషయాన్ని నన్ను ఆరోపిస్తున్న వాళ్లు వెళ్లి వాళ్ల కుటుంబాలకు చెప్పండి. రేపు ఒకవేళ వాళ్లలో ఒక్కరు బ్రతికి వున్నారని తెలిసినా... వారికి సంజాయిషీ చెప్పాల్సిన బాధ్యత మీదే!` అంటూ సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లో మాట్లాడారు.
తీవ్రవాదుల నుంచి తప్పించుకుని వచ్చిన హర్జిత్ మాసీ చెప్పిన విషయాలపై కూడా ఆమె స్పందించారు. `39 మందిని ఊచకోత కోశారని చెబుతున్న హర్జిత్ మాసీ మాటలను నేను నమ్మను. వారు నిజంగా చనిపోయారని చెప్పడానికి మృతదేహాలు గానీ, రక్తం గానీ, వీడియోలు గానీ లేనపుడు వాళ్లు చనిపోయారని చెప్పడం పాపంతో సమానం` అని సుష్మ అన్నారు. 2014లో మోసుల్ ప్రాంతంలో జరిగిన ఐసిస్ దాడిలో 39 మంది భారతీయులు ఇరాక్‌లో చిక్కుకున్నారు. ఇటీవల భారత్ వచ్చిన ఇరాక్ ప్రతినిధి వారి ఆచూకీ, క్షేమసమాచారాల గురించి ఎలాంటి సమాధానం చెప్పలేమన్నారు. దీంతో వారు బ్రతికే ఉన్నారని చెబుతూ విదేశాంగ మంత్రి ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందని ప్రతిపక్షం ఆరోపించింది.