: భారత్-చైనాల మధ్య యుద్ధం వస్తే.. దానికి అమెరికానే కారణం: చైనా
ఒకవేళ భారత్-చైనాల మధ్య యుద్ధం వస్తే దానికి అమెరికానే కారణమని చైనా వ్యాఖ్యానించింది. సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, చైనాకు వ్యతిరేకంగా అమెరికా మీడియా కథనాలను ప్రచురించింది. 'ట్రంప్ మస్ట్ సపోర్ట్ ఇండియా ఎగైనెస్ట్ చైనా' అనే శీర్షికతో వాషింగ్టన్ ఎగ్జామినర్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. యూఎస్ కు వ్యతిరేకంగా తయారవుతున్న చైనాను నిలువరించేందుకు భారత్ కు అమెరికా మద్దతు ఇవ్వాలని కథనంలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఈ కథనంపై చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ మండిపడింది. సమస్య ఉన్న ప్రతి చోటా అమెరికా తలదూరుస్తోందని విమర్శించింది. భారత్-చైనాల మధ్య చిచ్చు పెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని మండిపడింది. దక్షిణ చైనా సముద్రంలో కూడా అమెరికా అనవసరంగా ఉద్రిక్తతలను పెంచుతోందని ధ్వజమెత్తింది.