: తెలిసింది తెలిసినట్టు చెప్పమని చార్మీకి సలహా ఇచ్చాను!: అడ్వొకేట్ విష్ణువర్ధన్ రెడ్డి
హీరోయిన్ చార్మి వెంట తాను లేనని, ఆమెను ఎక్సైజ్ కార్యాలయం వద్ద దింపేసి తాను కోర్టుకు వెళ్లిపోయానని ఆమె తరఫున నిన్న హైకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది విష్ణు వర్ధన్ రెడ్డి వెల్లడించారు. అడ్వొకేట్ ను తీసుకు వచ్చినంత మాత్రాన, తన క్లయింట్ భయపడినట్టు కాదని ఆయన తెలిపారు. విచారణకు సహకరించాలని, తెలిసింది తెలిసినట్టు చెప్పాలని, అధికారులు స్నేహపూర్వకంగా ఉంటారని, అలానే మాట్లాడాలని సలహా ఇచ్చినట్టు చెప్పారు.
హైకోర్టుకు ఎందుకు వెళ్లారన్న ప్రశ్న ఎదురైతే, తన హక్కులను కాపాడుకునేందుకుకే వెళ్లినట్టు స్పష్టంగా చెప్పాలని సూచించానని అన్నారు. చార్మి ఎంతో ధైర్యవంతురాలని, విచారణను నిర్భయంగానే ఎదుర్కొంటుందన్న నమ్మకం తనకుందని విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. డ్రగ్స్ వాడేందుకు తాను వ్యతిరేకమని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాను కృషి చేస్తానని చార్మీ చెప్పినట్టు తెలిపారు. అధికారులు సాక్ష్యాలను చూపిస్తే, ఆర్గ్యుమెంట్స్ కు వెళ్లకుండా, జరిగింది జరిగినట్టు చెప్పాలని సలహా ఇచ్చినట్టు పేర్కొన్నారు. అమె తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని బయటకు వస్తారని అన్నారు.