: రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్, వైసీపీలు క్షమాపణలు చెప్పాలి: సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని, ఈ ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్, వైసీపీలు శతవిధాలా ప్రయత్నిస్తుండటం దుర్మార్గమైన చర్య అని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నిన్న పార్లమెంట్ లో పోలవరం ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్, వైసీపీలు ప్రవర్తించిన తీరు దారుణమని, ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నిస్తున్న ఆ రెండు పార్టీలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఏ ఉద్దేశంతో నిన్న పార్లమెంట్ లో ఈ అంశాన్ని కాంగ్రెస్, వైసీపీలు అడిగాయి? అని ప్రశ్నించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్, వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వైసీపీలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
కాగా, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ధర్మేంద్ర ప్రధాన్ తో మాట్లాడినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కు ఖర్చు పెట్టిన నిధులు, కాకినాడ వద్ద పెట్రోలియం కారిడార్ అంశాలు, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వద్ద ఐదు అంశాలపై చర్చించినట్టు చెప్పారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించాల్సి ఉందని, త్వరితగతిన పూర్తి చేస్తామనే పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి అప్పగించారని అన్నారు.