: రాష్ట్రపతి గుర్రపు బగ్గీని ఎలా గెలుచుకున్నామో తెలుసా?... అసలు కథ ఇది!
14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారానికి బ్రాండ్ న్యూ కారులో రాకుండా, ఏదో పాత కాలం నాటి గుర్రపు బండిలో వచ్చారేంటి? అనుకుంటున్నారా! ఆ గుర్రపు బండి వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది మరి! దాన్ని మనం రూపాయి బిళ్ల గాల్లోకి ఎగరవేసి గెల్చుకున్నాం మరి! నమ్మట్లేదా... అయితే తెలుసుకోండి!
ఈ బంగారు పూత పూసిన గుర్రపు బండి ఒక బ్రిటిష్ వైశ్రాయ్‌కి చెందింది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియా, పాకిస్థాన్‌లలో ఈ బండి ఎవరికి చెందాలో మీరు నిర్ణయించుకోండని బ్రిటిష్ వారు చెప్పారు. దీంతో ఆ సమస్యను భారత లెఫ్టినెంట్ కల్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్, పాకిస్థాన్ ఆర్మీ అధికారి షహబ్జాదా యాకుబ్ ఖాన్‌లు రూపాయి బిళ్ల సాయంతో తీర్చారు. అలా వేసిన టాస్‌లో భారత్ గెలిచి ఈ గుర్రపు బండిని దక్కించుకుంది. 1984 వరకు ఈ బండిని అన్ని వేడుకలకు రాష్ట్రపతి అధికార వాహనంగా ఉపయోగించేవారు.
తర్వాత రక్షణ సంబంధ కారణాలతో దీని వాడకాన్ని తగ్గించారు. తిరిగి 2014లో ప్రణబ్ ముఖర్జీ ఈ బండిని ఉపయోగంలోకి తెచ్చారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. అలాగే ఈ బండిలో మొదట పదవీ విరమణ చేస్తున్న రాష్ట్రపతి, నూతన రాష్ట్రపతి చెరో పక్కన కూర్చుంటారు. కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం తర్వాత వారిద్దరూ గుర్రపు బండిలో తమ తమ స్థానాలను మార్చుకుంటారు.