: ఒకప్పుడు వ్యాపారం ఉండేది.. దాన్ని మూసేశా: కేటీఆర్
సంక్షేమ రంగానికి స్వర్ణయుగంలా టీఆర్ఎస్ పాలన కొనసాగుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని పనులు సవ్యంగా జరుగుతున్నాయిని చెప్పారు. ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. కొందరు అభూత కల్పనలను ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దివాళాకోరు రాజకీయంతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని అన్నారు. తమకు భవిష్యత్తు ఉండదనే భయం కాంగ్రెస్ నేతలకు పట్టుకుందని ఎద్దేవా చేశారు.
జైరాం రమేష్ పెద్ద మేధావినని చెప్పుకుంటుంటారని... ఆయన ఏం మేధావో తనకు అర్థం కావడం లేదని కేటీఆర్ అన్నారు. తమపై కావాలనే జైరాం రమేష్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుమారుడికి చెందిన మోటార్ కంపెనీ నుంచి, వెంకయ్యనాయుడి కుమారుడికి చెందిన హర్షా టయోటా షోరూంల నుంచి పోలీస్ శాఖ కోసం భారీ ఎత్తున వాహనాలను కొనుగోలు చేశారంటూ జైరాం ఆరోపించారని... పోలీస్ డిపార్ట్ మెంట్ కోసం కొన్న వాహనాలను షోరూంల నుంచి కొనుగోలు చేయలేదని, డైరెక్ట్ గా టయోటా కంపెనీ నుంచే కొనుగోలు చేశామని చెప్పారు. ఒక్క టయోటా వాహనాలనే కాకుండా టాటా సుమోలు, మహీంద్రా బొలెరోలు, మారుతి స్విఫ్ట్ డిజైర్, ఐషర్ బస్సులు, తదితర వాహనాలను కూడా కొన్నామని తెలిపారు.
తనకు ఏడెనిమిదేళ్ల క్రితం ట్రాక్టర్లకు సంబంధించిన ఓ వ్యాపారం ఉండేదని... మంత్రి కాకముందే దాన్ని మూసేశానని కేటీఆర్ చెప్పారు. బోడిగుండుకు, మోకాలికి ముడి పెట్టే ప్రయత్నం చేస్తే... వాళ్లకు దణ్ణం పెట్టడం తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదని అన్నారు.