: సిట్ అధికారులు సినీ రంగాన్నే టార్గెట్ చేశారనడం సరికాదు.. నన్నడిగితే స్వచ్చందంగా బ్లడ్ శాంపిల్ ఇస్తా!: పోసాని
డ్రగ్స్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న ఎక్సైజ్ విభాగం సిట్ అధికారులకు నటుడు, రచయిత పోసాని కృష్టమురళి బాసటగా నిలిచారు. సిట్ అధికారులు సినీ రంగాన్ని లక్ష్యం చేసుకుంటున్నారంటూ నటుడు నారాయణమూర్తి, దర్శకుడు రాంగోపాల్ వర్మ వంటి వారు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పోసాని స్పందించారు. సిట్ అధికారులు సినీ రంగాన్నే టార్గెట్ చేశారనడం సరికాదన్నారు. ఈ కేసులో పోలీసులు సినీ రంగానికి చెందిన వారితోపాటు ఇతరులనూ విచారిస్తున్నారని పేర్కొన్నారు. విచారణకు హాజరైన వారు రక్తనమూనాలను ఎందుకు ఇవ్వడం లేదో తనకు తెలియదన్న ఆయన అది వారి వ్యక్తిగత విషయమని చెప్పారు. తనను అడిగితే మాత్రం స్వచ్చందంగా రక్త నమూనాలను ఇస్తానని ప్రకటించారు.