: పీత ప్రధాన పాత్రలో సినిమా!
ఏనుగు, పాము, కుక్క వంటి జంతువుల్ని ప్రధాన పాత్రలుగా పెట్టి తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. అంతెందుకు? దర్శకుడు రాజమౌళి ఈగను హీరోగా పెట్టి తీస్తే, అన్ని భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అదే కోవలో పీతను ప్రధాన పాత్రలో పెట్టి ఓ సినిమా నిర్మిస్తున్నారు. `జిత్తన్` సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు రమేశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూనం కౌర్ హీరోయిన్గా చేస్తోంది.
సందేశాత్మక చిత్రాలతో విమర్శకుల మెప్పు పొందిన ఆండాల్ రమేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పేరు `నండు ఎన్ నన్బన్ (పీత నా స్నేహితుడు)`. తప్పిపోయిన కథానాయకుణ్ని, కథానాయికతో కలపడంలో పీత పోషించిన పాత్రనే ఈ చిత్రంలో వైవిధ్యంగా చూపించనున్నారు. గ్రాఫిక్స్ ద్వారా పీత చేసే పనులను చూపించిన విధానం అందరికీ నచ్చుతుందని దర్శకుడు రమేశ్ అభిప్రాయపడ్డారు.