: వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ద్వీపంలో సినిమా థియేటర్ నిర్మించిన చైనా
దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చలాయించుకునే క్రమంలో భాగంగా అక్కడి యాంగ్జింగ్ ద్వీపంలో అత్యాధునిక సౌకర్యాలతో సినిమా థియేటర్‌ను చైనా నిర్మించింది. `శాన్సా ఇన్‌లాంగ్ థియేటర్` పేరు గల ఈ థియేటర్‌లో ఆదివారం రోజు `ద ఎటర్నిటీ ఆఫ్ జియో యులూ` సినిమాను 200 మంది స్థానికులు, నేవీ అధికారులు వీక్షించారు. ఈ ప్రాంతంలో తమ దేశం వారి వలసలను పెంపొందించేందుకు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలను చైనా కల్పిస్తోంది.
దక్షిణ చైనా సముద్రంలో సహజంగా ఉన్న ద్వీపాలతో పాటు కృత్రిమంగా కొన్నింటిని సృష్టించి అక్కడ కూడా తమ వారి ప్రాబల్యాన్ని పెంచాలని చైనా యత్నిస్తోంది. ఈ సముద్రంపై పరిశోధనలకు కూడా చైనా ఎక్కువగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ సముద్ర పరీవాహక ప్రాంతం, జల మార్గాల విషయంలో వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, తైవాన్ దేశాలకు చైనాతో వివాదాలు ఉన్నాయి.