: రాకుమారుడు ధరించిన బ్రాండ్ చొక్కా అని తెలియగానే ఎగబడి కొనేశారు... స్టాక్ నిల్!
రాజులు, రాజ్యాలు ఇంచుమించు అంతరించిపోయాయి. అయినా రాజవంశాలకు ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక బ్రిటన్ రాజకుటుంబానికి ఉన్న ఆదరణ ప్రపంచంలో మరే ఇతర రాజకుటుంబానికి లేదన్నది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో బ్రిటన్ రాజకుటుంబీకులు ధరించిన బ్రాండ్ దుస్తులను ధరించేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. తాజాగా, ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతుల కుమారుడు ప్రిన్స్ జార్జ్ వేసుకున్న చొక్కా రికార్డు సృష్టించింది. ప్రిన్స్ విలియం తన కుటుంబంతో కలిసి జర్మనీ, పోలాండ్ పర్యటనకు వెళ్లారు.
ఈ క్రమంలో జులై 22న బుల్లి జార్జి పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా ప్రముఖ స్పానిష్ బ్రాండ్ టిజ్జా చొక్కా వేసుకుని జార్జ్ సందడి చేశాడు. ఈ విషయాన్ని మీడియా ప్రసారం చేసింది. దీంతో ఈ బ్రాండ్ పిల్లల చొక్కాలకు ఎంతో డిమాండ్ ఏర్పడింది. ఆన్ లైన్ లో వేలానికి ఉంచిన షర్టులను ఒక్కటి కూడా మిగల్చకుండా కొనేశారు. దీంతో స్టాక్ నిల్ అయిపోయింది. దీంతో వెంటనే చొక్కాల డిమాండ్ గుర్తించిన టిజ్జా మరిన్ని చొక్కాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, ఈ చొక్కా ఖరీదు 90 పౌండ్లు అంటే సుమారు 7,544 రూపాయలు. పూర్తి కాటన్ తో తయారయ్యే ఈ చొక్కాలు వేసుకునేందుకు సౌకర్యవంతంగా ఉంటాయని పేరుంది.