: లండన్ లో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదిని రహస్యంగా ఖననం చేసిన బంధువు!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్ బ్రిడ్జిపై ప్రజలపై వాహనాన్ని తోలుతూ మారణకాండకు పాల్పడిన పాక్ సంతతికి చెందిన ఉగ్రవాది ఖుర్రం భట్ ను అత్యంత రహస్యంగా ఖననం చేశారు. వాస్తవానికి ఇతని భౌతిక కాయాన్ని ఖననం చేసేందుకు లండన్ లోని ఏ శ్మశానవాటికా ఒప్పుకోలేదు. దీంతో ఉగ్రవాది బంధువైన ఓ 27 ఏళ్ల వ్యక్తి తూర్పు లండన్ లోని అతని ఇంటకి సమీపంలో ఉన్న ఓ శ్మశానవాటికలో ఎలాంటి హడావుడి లేకుండా, రహస్యంగా పూడ్చిపెట్టాడు.
ఉగ్రవాదిగా అతను చేసిన పనిని వ్యతిరేకిస్తున్న కుటుంబ సభ్యులెవరూ అంత్యక్రియలకు హాజరుకాలేదు. అంతేకాకుండా, ఆడంబరంగా అంత్యక్రియలను నిర్వహిస్తే, తమ కుటుంబంపై వ్యతిరేకత పెల్లుబికే ప్రమాదం కూడా ఉందనే భావనతో, వారు అంత్యక్రియలకు దూరంగా ఉన్నారని సండే మిర్రర్ తెలిపింది. ఖుర్రంను పూడ్చిపెట్టిన వ్యక్తికి తప్ప, అతని సమాధి ఎక్కడుందో మరెవరికీ తెలియదని పేర్కొంది.