: అందరూ కామ్ గా విచారణకు వస్తే... చార్మీ మాత్రం ఎందుకిలా కోర్టుకెక్కింది?
సిట్ విచారణ నిమిత్తం సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి, వారిని పిలిపిస్తున్న వేళ, మిగతా వారెవరూ వేయని అడుగు చార్మీ వేసింది. తన బ్లడ్ శాంపిల్స్ తీసుకోరాదని కోరుతూ హైకోర్టును ఆశ్రయించడం సంచలనమే కలిగిస్తోంది. శ్యామ్ కే నాయుడు మినహా విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్ ల రక్తం, గోళ్లు, తల వెంట్రుకలను సేకరించిన ఉస్మానియా ఆసుపత్రి వైద్య బృందం వాటిని ఎఫ్ఎస్ఎల్ విభాగానికి పంపిందన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ వాడారన్న ఆధారాలు లభించిన వారి నుంచి సిట్ ఈ శాంపిల్స్ సేకరిస్తోంది.
చార్మీ మాత్రం తనకు ఇష్టం లేకుండా బ్లడ్ శాంపిల్ ను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తూ, ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3ని ఆమె ఉదహరించింది. భారత రాజ్యాంగంలోని ఈ సెక్షన్ నార్కోటిక్స్ చట్టాలను ప్రస్తావిస్తుంది. దీనిలోని వివరాల ప్రకారం, కేసులో పట్టుబడ్డ నిందితులు, అనుమానితులను వారి అనుమతితో థర్డ్ డిగ్రీ ఉపయోగించకుండా, లై డిటెక్షన్, పాలీ గ్రఫీ తదితర టెస్టులతో పాటు, రక్త నమూనాల సేకరణ ద్వారా సాక్ష్యాలను సేకరించవచ్చు. అందుకు నిందితుల నుంచి లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. నిందితులు ఈ పరీక్షలకు అంగీకరించకుంటే, మరో మార్గాన్ని విచారణ అధికారులు ఆశ్రయించవచ్చు.
ఇదే సమయంలో ఈ తరహాలో లభించిన సాక్ష్యాలు కోర్టులో నేర నిరూపణను చేయలేవు. గతంలో పలు కేసుల్లో వివిధ కోర్టులు ఈ విషయాన్ని తేల్చాయి. ఈ సాంకేతిక విధానాల ద్వారా నిందితుడు స్వయంగా ఇచ్చుకునే సాక్ష్యాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోదు. చట్టంలోని ఈ లొసుగులు గతంలో ఎన్నో నార్కోటిక్స్ కేసులను నీరుగార్చాయి.
ఇక చార్మీ విషయానికి వస్తే, గడచిన మూడు నెలల కాలంలో డ్రగ్స్ తీసుకుంటే, దాని ఆనవాళ్లు వెంట్రుకలు, గోళ్లలో మినహా మరెక్కడా తెలియవు. అందుకే సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు సిట్ వారి రక్త నమూనాలు సేకరిస్తోంది. ఒకవేళ చార్మీ ఈ మూడు నెలల్లోగా డ్రగ్స్ వాడివుంటే ఆ విషయం బయటకు వస్తుంది. అందువల్లే తాను రక్తాన్ని, గోళ్లు, వెంట్రుకల నమూనాలను ఇవ్వలేనని కోర్టును ఆశ్రయించినట్టు న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ కేసు విచారణ నేడు జరగనుండగా, కోర్టు ఏం చెబుతుందన్న విషయమై సర్వత్ర ఉత్కంఠ నెలకొని వుంది.